GodavariMaa

Button Ads

acmewebtech

గోదావరి పుష్కరాలు

గోదావరి

గోదావరి పుష్కరాలు 2015సంవత్సరం జూలై 14 నుండి 25వరకు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు గోదావరి పుష్కరాలకు రాజమండ్రి వచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుంటారు. 2003లో జరిగిన పుష్కరాల్లో ప్రతి రోజు లక్షలాది మంది గోదావరిలో పుణ్యస్నానాలు చేసినట్టు అప్పటి లెక్కలు చెప్పాయి. 12రోజుల పాటు రాజమండ్రికి అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి వెళ్లినట్టు అధికారులు లెక్కలు తేల్చారు. 12ఏళ్ల క్రితం నాటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా తేడా కనిపిస్తోంది. రవాణా సౌకర్యాలతో పాటు, జనాభా కూడా బాగా పెరిగారు. దీనికి తగ్గట్టుగా ఇప్పటి నుండే గోదావరి పుష్కరాలకు రాజమండ్రి, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పట్టణాలు, గ్రామాల్లో ఏర్పాట్లు మొదలుపెట్టకపోతే, పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించటం కష్టమవుతుంది. అందులోనూ గోదావరి పుష్కరాలు పేరు చెబితే, అందరికీ ముందుగా గుర్తొచ్చేది రాజమండ్రి నగరమే. అందువల్ల గోదావరి పుష్కరాలకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇతర పట్టణాలు, గ్రామాల సంగతి ఎలా ఉన్నాగానీ, గోదావరి ఒడ్డునే ఉన్న రాజమండ్రి నగరంలో మాత్రం ఇప్పటి నుండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోతే గోదావరి పుష్కరాలకు వచ్చే కోట్లాది మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గత 2003నాటి పుష్కరాలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదిన్నర ముందు నుండే ఏర్పాట్లపై దృష్టిపెట్టడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 12రోజుల పాటు పుష్కరాల మహోత్సం సజావుగా సాగిపోయింది. కానీ ఈసారి మాత్రం ఇంత వరకు అధికార యంత్రాంగం కనీసం దృష్టికేంద్రీకరించిన దాఖలాలు లేవు. రాష్ట్ర విభజన వివాదంతో 67రోజుల పాటు జిల్లాలోని రాష్ట్రప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయటం, అంతకు ముందు సహకార, పంచాయతీ ఎన్నికలు తదితర కారణాలతో అధికార యంత్రాంగం క్షణం తీరిక లేకుండా ఉంది. కనీసం ఇప్పటి నుంచయినా గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అదనంగా మరికొన్ని ఘాట్లు నిర్మించటం, గతంలో నిర్మించిన విఐపి ఘాట్ ఇపుడు రద్దీగా మారటంతో ప్రముఖుల కోసం ప్రత్యేకంగా మరో విఐపి ఘాట్‌ను నిర్మించటం, రాజమండ్రి నగరంలోని రోడ్లను వెడల్పు చేయటం, ఆక్రమణల తొలగింపు, రాజకీయపార్టీలతో సమావేశాలు, వివిధ స్వచ్ఛంద సంఘాలతో సమావేశాలు తదితర అనేక కార్యక్రమాలను ఇప్పటి నుండే చేపడితేనే గోదావరి పుష్కరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతాయి. ఆ దిశగా ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభంకావాలని నగర ప్రజలు కోరుతున్నారు.