GodavariMaa

Button Ads

acmewebtech

రాజమండ్రిలో శ్రీ విజయనామ ఉగాది సంబరాలు

రాజమండ్రిలో

అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గురువారం పుష్కర్‌ఘాట్‌లో శ్రీ విజయనామ సంవత్సర ఉగాది సంబరాలు జరిగాయి. సాయంత్రం 4.30గంటలకు ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా పుష్కర్‌ఘాట్‌లోని వేదికపై స్వామివారి పూజతో ప్రారంభమైన ఉగాది సంబరాలు, పంచాంగ శ్రవణం, పండిత సత్కారాలు,కవితాగోష్ఠి, ధార్మిక ఉపన్యాసం తదితర కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గోదావరి నదిపై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పంట్లుపై సత్యదేవుని శాంతి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. రైతు జన సంక్షేమం, పాడి పంటల అభివృద్ధి కోసం సత్యదేవుని దేవస్థానం అధికారులు శాంతి కళ్యాణాన్ని చేయించారు. అన్నవరం నుండి తీసుకొచ్చిన స్వామి ఉత్సవమూర్తులకు, అన్నవరం దేవస్థానం నుండి వచ్చిన వేదపండితులే శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అంతకు ముందు నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ప్రముఖ పండితుడు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ పంచాంగ శ్రవణ చేసారు. విజయనామ సంవత్సరంలో పేరుకు తగ్గట్టుగా అభివృద్ధి ఉంటుందన్నారు. వృద్ధి, హాని రెండూ ఉంటాయని, అయితే రాజు, రసాధిపతి గురుడు కావటంతో పాటు, నవనాయకుల్లో 5గురు శుభులు ఉండటం వల్ల ఈ ఏడాది మేలు ఎక్కువ ఉంటుందన్నారు. పాడి పంటలు బాగానే ఉంటాయని, పంటలకు అవసరమైన వర్షాలు బాగా కురుస్తాయని సుబ్రహ్మణ్యశర్మ చెప్పారు. తెల్ల ధాన్యాల దిగుబడి బావుంటుందన్నారు. ఉపద్రవాలు కలిగే ప్రమాదం కూడా కనిపిస్తోందన్నారు. ప్రమాదాలు, సరిహద్దుల్లో అలజడులు, తీవ్రవాద ముప్పు కూడా ఎక్కువే కనిపిస్తోందన్నారు. పంచాంగ శ్రవణం అనంతరం కవితాగోష్ఠి జరిగింది. అనంతరం పండిత సత్కారాలు జరిగాయి. ఈ సందర్భంగా పుష్కరఘాట్ ప్రాంతం పండగ కళను సంతరించుకుంది. కోలాటాలు, గరగ నృత్యాలు, జానపద నృత్యాలతో పుష్కరఘాట్ ప్రాంతం కోలాహలంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, అన్నవరం దేవస్థానం ఇఓ ప్రసాదుల వెంకటేశ్వర్లు, దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, ఎస్పీ రవికుమార్‌మూర్తి, కమిషనర్ ఎం జితేంద్ర, ఆర్డీఓ ఎం వేణుగోపాలరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ మధుఫోమ్రా తదితరులు హాజరయ్యారు.