GodavariMaa

Button Ads

acmewebtech

ఆందోళనను రేకేత్తిస్తోంన గోదావరిలో నీటిమట్టం

ఆందోళనను

రోజు రోజుకీ గోదావరిలో నీటిమట్టం తగ్గిపోవటం తీవ్ర ఆందోళనను రేకేత్తిస్తోంది. ఉన్నపళంగా బుధవారం మధ్యాహ్నం సమయంలో గోదావరి నీటిమట్టం నాలుగు అడుగులకు తగ్గిపోయింది. సాధారణంగా ఏప్రిల్‌ నెల ప్రారంభంలో గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గడం జరుగుతుంది. అయితే ఒక్క సారిగా నీటిమట్టం పడిపోవడం ఆందోళనకరమైనదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. గోదావరి నీటి ప్రవాహాన్ని ఆధారంగా చేసుకుని డెల్టాకు బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడం ఆనవాయితీ. అయితే సీలేరు నుంచి గోదావరిలోకి నీటి సరఫరాను ఇటీవల కాలంలోనే నిలిపివేశారు. దీంతో నీటి ప్రవాహం పూర్తిగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే గోదావరిలో నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టింది.
అయితే బుధవారం మధ్యాహ్నం జరిగిన పరిణామంతో నీటి పారుదల శాఖతోపాటు, కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే అప్పటికే జరగాల్సిన పని కాస్తా అయిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సాధారణంగా ఈ సమయానికి రాజమండ్రి పుష్కర ఘాట్‌ వద్ద 43 నుంచి 44 అడుగుల మధ్య నీటిమట్టం ఉంటుంది. అయితే ప్రస్తుత నీటిమట్టం 41 అడుగులకు పడిపోయింది. దీంతో రాజమండ్రి నగరానికి మంచి నీటి సరఫరా చేసే పంపులు పైకి కన్పించాయి. దీంతో గోదావరి నీటిమట్టానికి అనుగుణంగా ప్రత్యేక బెడ్‌ను ఏర్పాటు చేసి 260 హెచ్‌పి పంపులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మంచినీటి సరఫరాలో ఏవిధమైన ఇబ్బందులు లేకపోయినా, రానున్న కాలంలో తాగునీటి కోసం గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. వేసని కాలం ప్రారంభంలోనే పరిస్థితి ఇలావుంటే, మే నెలలో పరిస్థితి ఏమిటనే దానిపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
ప్రస్తుత పరిస్ధితిల్లో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశాలు కన్పించడం లేదు. గోదావరి డెల్టాలకు విడుదల చే స్తున్న నీటిని నిలుపుదల చేస్తేనే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని డెల్టాలకు నిలుపుదల చేసే పరిస్థితి లేదు. ఒకవేళ జెన్‌కో, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం సీలేరు నుంచి విడుదల కావాల్సిన నీటిని ప్రస్తుత పరిస్థితుల్లో విడుదల చేసే అవకాశాలు కన్పించడం లేదు. ఒక వేళ ఈ ప్రక్రియ సాగాలంటే వచ్చే నెల ఆఖరి వారం వరకూ వేచివుండాల్సిందేనని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. ఇదిలావుంటే, రాజమండ్రి నగరంలో ప్రస్తుత పరిధి మరింతగా పెరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నగరంలో 21 పంచాయితీలు విలీనం కానున్నాయి. ప్రస్తుతానికి హైకోర్టు జోక్యంతో తాత్కాలికంగా విలీనం ప్రక్రియ నిలిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ఆయా గ్రామాలు విలీనం అయితే నీటి సరఫరా పరిస్థితి ఏమిటనే దానిపై చర్చ సాగుతుంది.
ప్రస్తుతం నగర పరిధిలో ఉన్న జనాభాకే పూర్తి స్థాయిలో తాగునీటిని సరఫరా చేసే పరిస్ధితులు కన్పించడం లేదు. నేటికీ నగర శివారు ప్రాంతాలకు లారీలు, ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. అదైనా రెండు రోజులకోసారి ఒక ప్రాంతానికి ఒక లారీ ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో 21 పంచాయతీలను నగరంలో విలీనం చేస్తే తాగునీటి సరఫరా పరిస్థితి ఏమిటనే అంశంపై చర్చ సాగుతుంది.