GodavariMaa

Button Ads

acmewebtech

ఎస్‌ఇ సర్కిల్‌ కార్యాలయంలో పరిశ్రమల యాజమానులతో సమావేశ

ఎస్‌ఇ

పరిశ్రమలపై పవర్‌ పిడుగు పడింది. వేసవికి ముందే కొనసాగుతోన్న కోతలు పరిశ్రమల ను నీరుగార్చేలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో రోజురోజుకీ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడంతో పరిశ్రమలకు కోతలు తప్పవని హెచ్చరికలు ఆందోళన కల్గిస్త్తున్నాయి. జిల్లాలో 14 లక్షలకు పైగా విద్యుత్‌ వినియోగదారులు ప్రస్తుతం ఉన్నారు. రోజువారీగా సగటున విద్యుత్‌ వినియోగం 85 లక్షల యూనిట్ల పైగానే ఉంది. ప్రస్తుతం రోజువారీ కోటాగా జిల్లాకు 70 లక్షల యూనిట్ల మేర విద్యుత్‌ మాత్రమే సమకూరుతోంది.
దీంతో కోతలు అనివార్యం కావడంతో పరిశ్రమలకు సరఫరాను క్రమేపి తగ్గించే వ్యూహంతో పరిశ్రమల యాజమానులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాజమండ్రి ఎస్‌ఇ సర్కిల్‌ కార్యాలయంలో జిల్లాలోని పరిశ్రమల యాజమానులతో ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్టవ్య్రాప్తంగా 700 మెగావాట్ల విద్యుత్‌ లోటు ఉన్నందున కోతల సమయంలో యాజమానులు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉత్పత్తిని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్‌ కోతలు ఇంకా పెరిగితే పరిశ్రమలకు వారంలో మూడు రోజులపాటు హాలిడే ప్రకటించే హెచ్చరికలను ఈ సందర్భంగా జారీ చేశారు.
గత వేసవిలో తీవ్ర విద్యుత్‌ కోతల సమయంలో ఈ విధానాన్ని అమలు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పరిశ్రమలను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు, మెరుగైన విద్యుత్‌ సరఫరా జరిగేందుకు పరిశ్రమలకు డెడికేటెడ్‌ ఫీడర్స్‌ ద్వారా ప్రత్యేక లైన్లు వేసి విద్యుత్‌ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అయితే ఈ ప్రత్యేక లైన్ల విధానం ద్వారా 24 గంటలపాటు పరిశ్రమలు విద్యుత్‌ను పొందే సౌకర్యంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. 24 గంటలు విద్యుత్‌ సరఫరాను వినియోగించుకునే ఫ్యాక్టరీలు ఒక యూనిట్‌కు రూ.18 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పరిశ్రమల యాజమానులు లాభనష్టాలను బేరేజు వేసుకుంటున్నారు. యూనిట్‌ ధర రూ.18కి చేరితే పెద్ద ఎత్తున ఖర్చులు పెరిగి నష్టాలు చవిచూడక తప్పదనే భావన ఈ సమావేశంలో వ్యక్తమైంది.
గత రెండేళ్ళ నుంచి విద్యుత్‌ కోతలను ఎదుర్కొని ఉత్పత్తిని కొనసాగించలేక చిన్న, మధ్యతరహా పరిశ్రమల యాజమానులు వేసవిలో కార్మికులకు సెలవులు ఇచ్చి ప్యాక్టరీలు మూసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 24 గంటలపాటు నిరంతర విద్యుత్‌ సరఫరా సంగతి ఎలా ఉన్నా యూనిట్‌ ధరను రూ.18 నుంచి తగ్గిస్తేనే ఈ విధానంలో పరిశ్రమలు విద్యుత్‌ను పొందవచ్చునని పలువురు యాజమానులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా ప్రత్యామ్నాయాలు, ప్రత్యేక లైన్ల సంగతి ఎలా ఉన్నా గతంలో అనుసరించిన వారంలో మూడు రోజుల పవర్‌హాలిడే విధానాన్ని మళ్ళీ అమలు చేస్తే పరిశ్రమలు తీవ్ర నష్టాలు చవిచూడక తప్పదు.